100 కంపెనీలు.. 4 లక్షల కోట్లు

100 కంపెనీలు.. 4 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : మన దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు సునాయాసంగా బ్యాంకు రుణాలను ఎగ్గొడుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సేకరించిన సమాచారం ప్రకారం, 2019 మార్చి నాటికి నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ)లో 43 శాతానికిపైగా (రూ.4.02 లక్షల కోట్లు) టాప్‌-100 డిఫాల్టర్లకు చెందినవే. స్థూల ఎన్‌పీఏలలో 30 శాతానికిపైగా (రూ.2.86 లక్షల కోట్లు) వీటిలో 30 కంపెనీలు ఎగ్గొట్టినవే. 2019 మార్చి 31నాటికి మన దేశంలోని షెడ్యూల్డు కమర్షియల్‌ బ్యాంకులకు ఎగ్గొట్టిన అడ్వాన్స్‌లు, రుణాల మొత్తం (స్థూల ఎన్‌పీఏలు) రూ.9.33 లక్షల కోట్లు. భారత దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ చరిత్రలో 2018 తర్వాత నమోదైన రెండో అతి పెద్ద మొండి బకాయిల మొత్తం ఇది. 15 కంపెనీల ఎన్‌పీఏలే 4.58 లక్షల కోట్లు ఈ టాప్‌-100  బ్యాంక్‌ డిఫాల్టర్స్‌లో బడా పారిశ్రామికవేత్తలు నడుపుతున్న వివిధ రంగాలకు చెందిన పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు 2019 మార్చి 31నాటికి రూ.8.44 లక్షల కోట్లు రుణాలు ఎగ్గొట్టాయి. దీనిలో సగానికిపైగా రాని బాకీలుగా బ్యాంకులు ప్రకటించాయి. ఈ 100 కంపెనీల మొత్తం రుణాల్లో సగానికిపైగా అంటే, రూ.4.58 లక్షల కోట్లు 15 కంపెనీలు తీసుకున్నాయి. ఇవి మాన్యుఫ్యాక్చరింగ్‌, విద్యుత్తు, నిర్మాణ రంగాలకు చెందిన కంపెనీలు.

ఆ రంగాలవే అధికం..

స్థూల ఎన్‌పీఏలు 2015 మార్చి 31నాటికి రూ.3.23 లక్షల కోట్లు కాగా, 2018 మార్చి 31నాటికి రికార్డు స్థాయిలో రూ.10.36 లక్షల కోట్లకు పెరిగాయి. 2019లో తగ్గడం ప్రారంభమై, 2023 మార్చి 31నాటికి రూ.5.71 లక్షల కోట్లకు తగ్గాయి. దీనికి కారణం కొంత వరకు రుణదాతలు రైట్‌డౌన్‌ చేయడం. బ్యాంక్‌ రుణాలు, అడ్వాన్స్‌ల ఎగవేతకు పాల్పడుతున్నవాటిలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఉంటున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్‌, ఇంధనం, విద్యుత్తు, నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌, టెలికాం వంటి రంగాలకు చెందిన కంపెనీల ఎన్‌పీఏలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ జాబితాలోని 82 కంపెనీలు దివాలా ప్రక్రియలో వివిధ దశల్లో ఉన్నాయి. మూడో వంతు కంపెనీలు లిక్విడేషన్‌ రూట్‌లో వెళ్తున్నాయి. అంటే వీటి నుంచి బ్యాంకులకు చాలా తక్కువ సొమ్ము మాత్రమే లభిస్తుంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos