కోల్‌కతా: తృణామూల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, యువ నేతల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన వారసులు ఎవరన్న దానిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్లారిటీ ఇచ్చారు. పార్టీ నాయకత్వమే కలిసికట్టుగా తన వారసులపై నిర్ణయం తీసుకుంటుందని, వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. న్యూస్18 బంగ్లా ఛానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె విషయాన్ని తెలిపారు. తృణమూల్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం లేదన్నారు. నేనేమీ పార్టీని కాదు అని, మేం అందరం కలిస్తే పార్టీ అని, ఇది సంయుక్త కుటుంబం అని, నిర్ణయాలను కలిసి తీసుకుంటామని ఆమె తెలిపారు. మీ వారుసులు ఎవరని జర్నలిస్టు వేసిన ప్రశ్నను దాటివేస్తూ.. టీఎంసీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఇక్కడ ఏ ఒక్కరూ ఆదేశాలు ఇవ్వరన్నారు. ప్రజలకు ఏది మంచిదో అది పార్టీ నిర్ణయిస్తుందని, తమకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఉన్నారని, కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమే అని, ఇవాళ కొత్తగా వచ్చిన వారు రేపు సీనియర్ అవుతారన్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు మమతా బెనర్జీకి క్లోజ్‌గా ఉన్నారు. ఇక ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీకి యువ నాయకులు దగ్గరగా ఉన్నారు. ఆ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.