
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరగుతున్నాయి.కొన్ని చోట్ల ప్రతిపక్షం వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతుండగా అధికార పార్టీ తెలుగుదేశానికి కూడా అంతేస్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతుండడం విశేషం.ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీ కండువా కప్పుకోగా మంగళవారం మాజీ మంత్రి,కడప జిల్లా తెదేపా సీనియర్ నేత ఖలీల్‌బాష కూడా మంగళవారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.మరోవైపు చీరాల తెదేపా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇప్పటికే జనసేన,వైసీపీలతో సంప్రదింపులు జరుపుతున్న ఆమంచి ఏపార్టీలో చేరాలనే విషయంపై కార్యకర్తలు,మద్దతుదారులతో చర్చిస్తున్నారు.ఆమంచిని బుజ్జగించడానికి మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు ప్రయత్నించినా ఆమంచి వెనక్కు తగ్గనేట్లు సమాచారం.

మరోవైపు ఆమంచితో పాటు కేంద్ర మాజీ మంత్రి,కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి వ్యవహారం కూడా సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించింది. టీడీపీలోకి దాదాపుగా ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపించిన కేంద్ర మాజీ మంత్రి – కర్నూలు మాజీ ఎంపీ – కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పుడు మాట మార్చేశారు. బాబు ఆహ్వానం మేరకు భార్య – కొడుకు – తమ్ముడితో కలిసి ఉండవల్లికి వచ్చి బాబుతో డిన్నర్ చేసి వెళ్లిన కోట్ల… అతి త్వరలోనే టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే కోట్ల వ్యూహం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు తాను టీడీపీలో చేరుతున్నానని ఎప్పుడు చెప్పానంటూ మీడియాకే ఎదురు ప్రశ్నలు సంధించిన కోట్ల… తనకు ఒక్క టీడీపీ నుంచి మాత్రమే ఆహ్వానం అందలేదన్న విషయాన్ని గుర్తించాలని సంచలన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యతో షాక్ తిన్న మీడియా ప్రతినిధులు తేరుకోక ముందే… కోట్ల మరో బాంబు లాంటి మాట చెప్పారు. తనకు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందని – ఇప్పటిదాకా తాను ఏ పార్టీలో చేరతానో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పేశారు. ఈ వ్యాఖ్య చంద్రబాబుకు నిజంగానే శరాఘాతంగానే భావించక తప్పదు. ఎందుకంటే.. ఇప్పటికే కోట్ల పార్టీలో చేరుతున్నారని – కర్నూలు జిల్లా నేతలు సర్దుకుపోవాలని – కోట్లతో కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదే మాట చెప్పారు. ఈ మాటను ఆసరా చేసుకున్న ఎల్లో మీడియా కోట్ల టీడీపీలో చేరిపోయినట్టేనని కూడా వార్తలు వండి వార్చేశాయి. అయినా చంద్రబాబుతో డిన్నర్ భేటీకి వెళ్లిన తర్వాత కూడా కోట్ల ఇంకా పార్టీలో చేరేందుకు ఎందుకు సిద్ధపడలేదన్న వార్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికప్పుడు పచ్చజెండా ఊపడంతో పాటుగా కర్నూలు పార్లమెంటు సీటుతో పాటుగా తన సతీమణి కోట్ల సుజాతమ్మకు డోన్ అసెంబ్లీ సీటు – కుమారుడు రాఘవేంద్ర రెడ్డికి ఆలూరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోట్ల కండీషన్ పెట్టారు. అయితే డోన్ సీటుపై ఇప్పటికే కేఈ ప్రభాకర్ కర్చీఫ్ వేసుకుని మరీ కూర్చున్నారు. ఆలూరు సీటునైనా హామీ ఇద్దామంటే అక్కడి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవట. ఈ నేపథ్యంలో మొన్నటి డిన్నర్ భేటీలో కర్నూలు పార్లమెంటు వరకైతే హామీ ఇవ్వగలను గానీ… డోన్ – ఆలూరు అసెంబ్లీలపై మాత్రం ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేనని – వాటి గురించి తర్వాత మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పారట. అయితే ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వస్తున్న కోట్ల కుటుంబం ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి వస్తే… సింగిల్ సీటు ఇస్తామనడం ఎంతవరకు భావ్యమంటూ కోట్ల వర్గం కాస్తంత అసంతృప్తిగానే ఉందట.