పీఎన్‌బీకి లాభాలు

  • In Money
  • February 5, 2019
  • 173 Views
పీఎన్‌బీకి  లాభాలు

దిల్లీ: వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నష్టాల నుంచి బయటపడింది. నీరవ్‌ మోదీ రూ.13వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత పీఎన్‌బీకి తొలిసారి లాభాలు వచ్చాయి. మూడో త్రైమాసికంలో పీఎన్‌బీ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. మంగళవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో పీఎన్‌బీ 7.12శాతం లాభాలను ఆర్జించింది. డిసెంబరు 31, 2018తో ముగిసిన త్రైమాసికంలో పీఎన్‌బీ రూ.246.51కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. నిరుడు ఇదే సమయంలో పీఎన్‌బీ రూ.230.11కోట్ల లాభాలను ఆర్జించింది. అయితే.. బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం 2.64శాతం తగ్గి రూ.14,854.24కోట్లు చేరింది. బ్యాంకు ఆదాయం రూ.15,257.5కోట్లుగా ఉంది. స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) మాత్రం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 12.11శాతం ఉండగా.. మూడో త్రైమాసికంలో అది 16.33శాతానికి చేరింది. మొండిబకాయిల కోసం కేటాయించిన ప్రొవిజన్లు రూ.2,996.42కోట్లు ఉండగా.. అవి ఇప్పుడు రూ.2,565.77కోట్లకు తగ్గాయి.
మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో పీఎన్‌బీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఒకానొక సమయంలో 3శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి 73.35గా  ఎన్‌ఎస్‌ఈలో ట్రేడవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos