స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు

స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు

హనుమకొండ: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. శుక్రవారం హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన మంత్రి.. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డాన‌ని అన్నారు. మంత్రి కొండా సురేఖ ఇంకా మాట్లాడుతూ… “తాను ఏ విష‌యంలోనైతే బాధ‌ప‌డ్డానో.. ఆ విష‌యంలో మ‌రొక‌రిని నొప్పించాన‌ని తెలిసి నా వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నాను. నేను ప‌డ్డ బాధ మ‌రొక‌రు ప‌డ‌కూడ‌ద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టాను. అయితే, కేటీఆర్ విషయంలో మాత్రం వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేదు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు రివ‌ర్స్‌లో న‌న్ను ఆయన క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంది. ఆయ‌న వ్య‌వ‌హారం దొంగే.. దొంగా దొంగా అన్న‌ట్లుగా ఉంది. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయ‌ప‌రంగా ముందుకెళ్లం జ‌రుగుతుంది” అని మంత్రి సురేఖ‌ అన్నారు. ఇక మంత్రి సురేఖ ఇప్ప‌టికే సమంతకు ఎక్స్ వేదిక‌గా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అంటూ మంత్రి తెలిపారు. కానీ, స‌మంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. త‌న‌ వ్యాఖ్యల పట్ల ఆమె కానీ, స‌మంత‌ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్ల‌యితే బేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. అన్యదా భావించవద్దని మంత్రి సురేఖ త‌న ఎక్స్ పోస్టులో వెల్లడించారు.

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos