ముంబయి: జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రతో కంపెనీ రుణదాతలు చెల్లింపులకు సంబంధించి బేషరతుగా వ్యక్తిగత పూచికత్తు కోరినట్లు సమాచారం. ఆ మేరకు రుణదాతలు , జీ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రుణదాతల బృందానికి జీపై అపరిమిత అధికారాలు సంక్రమించాయి. రుణదాతలకు జీ గ్రూప్ దాదాపు రూ.13,500 కోట్లు బకాయిచెల్లించాల్సి ఉంది. దీనికి గాను జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిష్‌టీవీల్లో వాటాలను హామీగా ఇచ్చారు. ‘దరిమిలా రుణదాతలు దివాల ప్రక్రియను ప్రారంభించరు. ఎస్సెల్ గ్రూప్ కోలుకొని వ్యూహాత్మక వాటాలను విక్రయించేందుకు తగిన సమయం ఇస్తారు. దీనివల్ల ఎస్సెల్ గ్రూప్ వాటాలను తక్కువకు విక్రయించాల్సిన అవసరం రాదు. గోప్యత దృష్ట్యా ఈ ఒప్పంద వివరాలను వెల్లడించలేము. ’’ అని జీ పేర్కొంది. ఒప్పంద వివరాల ప్రకారం వ్యూహాత్మక వాటాల విక్రయం నుంచి రుణదాతలకు లాభాన్ని ఇవ్వడంతోపాటు వారి సొమ్ముకు వ్యక్తిగత పూచికత్తు ఇచ్చినట్లు స్పష్టమైంది. దీనిని సెబీ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండియా(ఏఎంఎఫ్‌ఐ)లు కూడా పరిశీలించాయి. జీ వాటాదారుల పెట్టుబడులపై ప్రభావం చూపకుండా ఈ ప్రక్రియ పూర్తికావాలని సెబీ సూచించింది. తనఖాలో షేర్లను విక్రయిస్తే అసలుకే ఎసరు..జీ రుణదాతల్లో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐసీఐసీఐ ప్రెడెన్షియల్ వంటి సంస్థలు ఉన్నాయి. తమ రుణాల వసూలుకు తనఖాలో ఉన్న జీ గ్రూప్ షేర్లను విక్రయించడం మొదలు పెడితే వాటి విలువ ఒక్కసారిగా పడిపోతాయని ఈ సంస్థలు గుర్తించాయి. ఈ విషయం జనవరి 25నాటి పరిస్థితితో పూర్తిగా అర్థమైంది. దీంతో కొంత వేచి చూసే ధరోణలో ఈ సంస్థలు వ్యవహరించాయి. ఈ క్రమంలో తమ సొమ్ముకు అదనపు పూచికత్తును సాధించుకొన్నాయి. ఇదే సమయంలో తమ కనుసన్నల్లో వివాదం పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నం చేశాయి. తాజా ఒప్పందంతో జీ సంస్థపై మరింత పట్టు లభించగా.. వ్యూహాత్మక వాటాల విక్రయానికి అవకాశం లభించింది. కొత్త ఒప్పందం ప్రకారం జులై31నాటికి ప్రతిపాదించిన వాటాల విక్రయాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లావాదేవీలను సెప్టెంబర్ 30 నాటికి ముగించాలి. ఈ క్రమంలో రుణదాతలతో జీ ప్రతివారం కాన్ఫరెన్స్ కాల్స్ ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు నెలకోసారి తమ ప్రతినిధితో వ్యూహాత్మక వాటాల విక్రయ పురోగతి వెల్లడిస్తుంది. ఇదే సమయంలో జీ ప్రమోటర్ గ్రూప్ షేర్లను ఒక ప్రత్యేక డీమాట్ ఖాతాకు మళ్లించి దానిని పరిశీలించే అధికారాన్ని రుణదాతలకు కల్పిస్తారు.పుంజుకొన్న జీషేర్లు..నేటి మార్కెట్లో జీ షేర్లు పుంజుకొన్నాయి. ఉదయం లాభాలతో మొదలైన జీ కౌంటర్ ట్రేడింగ్ జరిగే కొద్ది మరింత పుంజుకొంది. ఉదయం 11.14 గంటలకు దాదాపు 2.88 శాతం లాభంతో రూ.357.75 వద్ద ట్రేడవుతోంది. రుణదాతలతో ఒప్పందం కొలిక్కి రావడంతో మదుపరుల్లో విశ్వాసాన్ని నింపింది. మరోసారి సుభాష్ చంద్రకు కష్టాల నుంచి కొంత ఊపిరి పీల్చుకొనే సమయం లభించిందన్నమాట..!