ఏలూరు : టీటీడీని హైజాక్ చేసి తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని, దీని అడ్డుకోకపోతే భవిష్యత్తులో శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయం ఇలా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను గుప్పిట్లోకి తెచ్చుకొని కేంద్రం పెత్తనం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు హెచ్చరించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజులు పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వి.శ్రీనివాసరావు హాజరై తొలిరోజు తన సందేశాన్ని ఇచ్చారు. టిటిడి లో నెలకొన్న లడ్డు సమస్య మతం రంగు పులుముకుంటున్నదని అన్నారు. దీన్ని అదునుగా చేసుకుని రాష్ట్రంలోని దేవాలయాలపై ఆధిపత్యం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు తమకు నచ్చిన విధంగా మాట్లాడుతున్నారని, బిజెపి వాళ్లు ఆ కేసును సిబిఐకి అప్పగించాలంటున్నారని చెప్పారు. టీటీడీని వశం చేసుకొని వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారు. పార్టీల మధ్య గొడవ… మత రాజకీయాల కుట్రగా జరుగుతున్నదన్నారు. మత రాజకీయాలు దేశానికి మంచిది కాదన్నారు. మతం, ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సంప్రదాయాలను అందరూ గౌరవించాలని, అదే క్రమంలో వర్ణాశ్రమాలు, అంటరానితనం, స్త్రీ పురుష వివక్ష వంటి వాటిని వ్యతిరేకించాలని అన్నారు. అంతేతప్ప మేము శాసిస్తాం మీరు అమలు చేయండి అన్న రీతిన ఉండకూడదన్నారు. దేవుడికి పూజలు ఎలా చేయాలో ప్రజలకు తెలుసు అన్నారు. రాష్ట్రంలో నాయకులు కేంద్రానికి అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడకూడదన్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఆయన అనుచరులు గుర్తించాలన్నారు. ఏపీ యూపీ గా మార్చే అవకాశం ఇవ్వకూడదు అన్నారు. రాష్ట్రం లో ప్రజల మధ్య శాంతి సామరస్యాలు ఉన్నాయని, వాటిని చెడగొట్టి మతోన్మాద విస్తరణకు అవకాశం ఇవ్వకూడదన్నారు.
రైతు ఆదాయం పెరిగితేనే దేశం అభివృద్ధి…
మోడీ ప్రభుత్వ విధానాలు రైతులను చిదిమేస్తున్నాయన్నారు. కంగనా రౌత్ మాటలను బట్టే బిజెపి నాయకులకు రైతులపట్ల ఎంత ద్వేషం వుందో అర్థమౌతోందన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నదంటూ మోడీ చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలన్నారు. రైతు సంపద ఎక్కడ పెరిగిందని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళుతోందని అన్నారు. గిట్టుబాటు ధర చట్టం చేసి అమలు చేయాల్సిన మోడీ… రైతులను మోసం చేశారన్నారు. కార్పొరేట్ల కోసం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని అన్నారు. గిట్టుబాటు ధర చట్టం చేసి అది అమలు చేయని వ్యాపారులపై కేసులు పెట్టాలని, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా గుర్తించడం లేదన్నారు. రైతుల ఉసురుతీస్తున్న మార్కెట్లను అదుపు చేయాలన్నారు. గిట్టుబాటు ధర అమలు కాక రాష్ట్రంలో ప్రతి ఏటా రైతులు లక్ష కోట్లు నష్టపోతున్నారని అన్నారు. రైతుల కష్టం రైతులకు అందాలని, రైతుల ఆదాయం పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 30 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగంలో 62 శాతం జనాభా ఉండేవారని, ఇప్పుడు అది 50 శాతానికి పడిపోయిందని అన్నారు. వ్యవసాయం నుంచి చాలామంది వైదొలుగుతున్న పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఈ పదేళ్లలో నాలుగున్నర లక్షల వ్యవసాయ భూమి తగ్గిపోయిందన్నారు. ఇది అభివృద్దా..? వినాశనమా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పంటల భీమా కింద రూ. వెయ్యి కోట్లు బీమా కంపెనీకి చెల్లిస్తే… రూ.400 కోట్లు కూడా రైతులకు ఇవ్వడం లేదన్నారు. రైతులతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ, సహకార, పంచాయతీ వ్యవస్థలను కేంద్రం తమ చేతుల్లో పెట్టుకుంటున్నదని వివరించారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడితే కేసులు పెడుతున్నారన్నారు. కార్పొరేట్ల కోసం వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెడుతున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం కార్పొరేట్ల నుంచి వేలకోట్లు నిధులు రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయన్నారు. అందుకు ప్రతిఫలంగా కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలు చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు.