అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతున్నందున దాని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించారు.వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం … తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సచివాలయం నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చలి వాతావరణానికితోడు వర్షం కురుస్తుండటంతో అనేక రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరో ద్రోణితో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.