దిల్లీ: లోక్‌సభ సమావేశాలు సజావుగా జరగనీయకుండా ఆందోళన చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై స్పీకర్ సుమిత్రా మహజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే టీఎంసీ నేతలు సీబీఐ vs కోల్‌కతా పోలీస్ కేసు విషయంపై ఆందోళన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ కొద్ది సేపు వాయిదా పడింది. ఈ సందర్భంగా స్పీకర్ ఆందోళన చేస్తున్న నేతల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.‘మీకు సీబీఐపై విశ్వాసం లేదా? సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా? ఇది సరైనది కాదు. ఈ కేసును ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. పార్లమెంటు కార్యకలాపాలు సక్రమంగా జరగనీయండి. అన్ని సంస్థలు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి’ అని ఆమె అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే టీఎంసీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి కాంగ్రెస్, తెరాస, ఎస్పీ, ఆర్జేడీ నేతలు కూడా మద్దతుగా వెల్‌లోకి వెళ్లారు కానీ ఎటువంటి నినాదాలు మాత్రం చేయలేదు.