పాండ్యాపై భజ్జీ ప్రశంసల జల్లు

పాండ్యాపై భజ్జీ ప్రశంసల జల్లు

ముంబయి: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో అతడి బ్యాటింగ్‌, బౌలింగ్‌ అద్భుతమని పేర్కొన్నాడు. హార్దిక్‌ ఫామ్‌ చూసి సంతోషిస్తున్నానని వెల్లడించాడు. కివీస్‌పై ఐదో వన్డేలో అతడు 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. భారీ సిక్సర్లు బాదేశాడు. అందులో హ్యాట్రిక్‌ సిక్సర్లు ఉన్నాయి. బంతితోనూ రాణించి రెండు కీలక వికెట్లు తీశాడు. ‘హార్దిక్‌ పాండ్య బ్యాటు, బంతితో అద్భుతంగా రాణించాడు. అతడి ఫామ్‌ చూసి చాలా సంతోషిస్తున్నా. తనపైనున్న వివాదాన్ని పక్కకు నెట్టేశాడు. అతడి క్రికెట్‌ గురించి మరెవరూ మాట్లాడకుండా చేశాడు. పాండ్య ప్రదర్శన చాలా చాలా బాగుంది. అతడు టీమిండియాలో అత్యంత కీలక సభ్యుడు. బ్యాటు, బంతితో రాణించడం భారత జట్టుకు శుభ శకునాలు’ అని భజ్జీ అన్నాడు.  ఐదో వన్డేలో 18 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న స్థితిలో అంబటి రాయుడి (90) స్థిరమైన బ్యాటింగ్‌ను హర్భజన్‌ మెచ్చుకున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో పురోగతి సాధించినందుకు అభినందించాడు. కాఫీ విత్‌ కరణ్ షోలో పాండ్య అనుచిత వ్యాఖ్యలపై భజ్జీ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos