న్యూఢిల్లీ: కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ పేర్కొంది. సీబీఐకి ఇది నైతిక విజయమని అభివర్ణించింది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు విచారణకు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను అరెస్టు చేయడం సహా ఎలాంటి బలవంతపు చర్యలకు దిగరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐకి సీపీ పూర్తిగా సహకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ… ‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. సీబీఐకి నైతిక విజయం. పోలీస్ కమిషనర్ సహా చట్టానికి ఎవరూ అతీతులు కారని ఈ తీర్పుతో మరోమారు స్పష్టమైంది…’’ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో విచారణకు వాతావరణం అనుకూలించపోవడం వల్లే మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఆయనను విచారించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో సీపీ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లడంతో స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి వారెంటూ లేకుండా 40 మంది సీబీఐ అధికారులు రావడంతో… పశ్చిమ బెంగాల్ పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. మరోవైపు సీబీఐ విచారణ పేరుతో కేంద్రం తమపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ సీఎం మమత కోల్‌కతాలో ధర్నాకు దిగడంతో దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.