కోల్కతా : నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమక్షంలో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వాగతించారు. దేశం తుపాకులు, గో రక్షకులతో నడవదన్నారు. ఆమె సీబీఐకి వ్యతిరేకంగా మూడు రోజుల నుంచి ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తమ నైతిక విజయమని మమత చెప్పారు. న్యాయ వ్యవస్థ పట్ల తమకు గౌరవం ఉందన్నారు. ఇటువంటి ఆదేశాలు గతంలో కూడా జారీ అయ్యాయన్నారు. తాను అందుబాటులో ఉండబోనని రాజీవ్ కుమార్ ఎన్నడూ చెప్పలేదన్నారు. ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పిందన్నారు. ఈ తీర్పు చెప్పినందుకు కృతజ్ఞులమని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి విజయమని చెప్పారు. దర్యాప్తు సంస్థల అధికారులకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాళ్ళు కూడా తమ సోదరులేనన్నారు. అయితే వారిని రాజకీయంగా ఉపయోగించుకోరాదని తెలిపారు.