పిడుగు పడి ముగ్గురు హాకీ ఆటగాళ్లు మృతి

పిడుగు పడి ముగ్గురు హాకీ ఆటగాళ్లు మృతి

రాంచి: పిడుగు పడి ముగ్గురు హాకీ ఆటగాళ్లు మృతి చెందిన విషాద సంఘటన జార్ఖండ్లోని సిమ్దేగాలో గల కొలెబిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝపాలా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామ మైదానంలో హాకీ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో ఆగస్టు 14వ తేదీ బుధవారం సాయంత్రం సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా, ఆగస్టు 15వ తేదీ ఉదయం ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. స్వాతంత్య్ర వేడుకలను చిరస్మరణీయంగా మార్చేందుకు నిర్వహించిన ఈ మ్యాచ్లో ఆటగాళ్లంతా సెమీఫైనల్ ఆడేందుకు మైదానంలోకి దిగగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.తడవకుండా తమను తాము రక్షించుకోవడానికి, ఆటగాళ్లందరూ మైదానం వైపు చెట్ల కింద నిలబడ్డారు. ఇంతలో ముగ్గురు ఆటగాళ్ళు, మరో ఐదుగురు గ్రామస్తులు తలదాచుకున్న చెట్టుపై అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో చెట్టు విరిగిపడడమే కాకుండా కింద నిల్చున్న ముగ్గురు ఆటగాళ్లు కూడా తీవ్రంగా కాలిపోయి కొద్దిసేపటికే చనిపోయారు. చెట్టు వేరుకు కొద్ది దూరంలో నిలబడిన ఐదుగురు గ్రామస్తులు కూడా తీవ్రంగా కాలిపోయారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు ఆటగాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరణించిన ఆటగాళ్లను టుటికైల్ రేబెడా నివాసి సేనన్ డాంగ్, ఎనోస్ బండ్, తక్రమా నివాసి నిర్మల్ హౌరోగా గుర్తించారు. ఈ ఘటనలో సలీం బాగే, ప్యాట్రిక్ బాగే, క్లెమెంట్ బాగే, పాత్రస్ డాంగ్, జిలేష్ బాగే తీవ్రంగా గాయపడ్డారు. వారందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos