ఈడీ 5 వేల కేసుల్లో రుజువైనవి 40 కేసులే?

ఈడీ 5 వేల కేసుల్లో రుజువైనవి 40 కేసులే?

న్యూ ఢిల్లీ: ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) చట్టం కింద గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 5 వేల కేసులు నమోదుచేస్తే, నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈడీ దర్యాప్తు ప్రక్రియను మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ వ్యాపారి కేసును బుధవారం విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈడీ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది.‘పీఎంఎల్ఏ చట్టం కింద గడిచిన పదేండ్లలో 5 వేలకు పైగా కేసులను ఈడీ నమోదు చేసినట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. అయితే, ఇందులో కేవలం 40 కేసుల్లో మాత్రమే నేరారోపణలు రుజువైనట్టు పేర్కొంది. ఇదెలాంటి పరిస్థితి అనేది మీరే (ఈడీ) ఊహించుకోండి. మీ దర్యాప్తు ప్రక్రియను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలే చెప్తున్నాయి. కేసు నమోదుచేయడమే కాదు.. కోర్టులో దాన్ని నిరూపించడానికి తగిన శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించాలి. ఇక, ఈ కేసు విషయానికి వస్తే, సాక్ష్యులుగా కొందరిని చూపిస్తున్నారే గానీ, శాస్త్రీయ పరమైన ఆధారాలను కోర్టుకు సమర్పించట్లేదు. అందుకే శాస్త్రీయ పరమైన ఆధారాలను ఇవ్వాలని కోరుకొంటున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
కేంద్రం ఏం చెప్పిందంటే?
2014 నుంచి ఇప్పటివరకూ పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ.. 5,297 కేసులను నమోదు చేయగా, ఇందులో 40 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయని, మిగతా మూడు కేసులు వీగిపోయాయని కేంద్రం పార్లమెంట్కు వెల్లడించింది., కాగా ఈడీ కేసులపై ప్రతిపక్షాలు గతకొన్నేండ్లుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈడీ నమోదు చేసిన కేసుల్లో నేరారోపణలు రుజువైన కేసులు వేళ్లమీద లెక్కపెట్టవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన లెక్కలు ఈ విమర్శలను బలపరుస్తుండటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos