భోపాల్: బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పుస్తకం రాసిన నటి కరీనాపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుక్ టైటిల్లో బైబిల్ అన్న పదాన్ని వాడడాన్ని తప్పుపడుతూ ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. కరీనా కపూర్పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్ ఆంథోనీ పిటీషన్ వేశారు. పుస్తకం టైటిల్లో బైబిల్ అన్న పదాన్ని ఎందుకు వాడారని కోర్టు ప్రశ్నలు వేసింది. పుస్తకంపై బ్యాన్ విధించాలని అడ్వకేట్ ఆంధోనీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పుస్తకం అమ్మకందారులకు కూడా నోటీసులు జారీ చేశారు. బుక్ టైటిల్లో బైబిల్ పదం వాడడం క్రైస్తవ సమాజ మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని జబల్పుర్కు చెందిన సామాజిక కార్యకర్త ఆంథోనీ తన పిటీషన్లో ఆరోపించారు. క్రైస్తవులకు బైబిల్ చాలా పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్తో పోల్చడం సరికాదు అని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. తన పుస్తకానికి పాపులారిటీ తీసుకువచ్చేందుకు నటి కరీనా ఆ పదాన్ని వాడినట్లు ఆంథోనీ ఆరోపించారు. 2021లో ఈ బుక్ను పబ్లిష్ చేశారు.