బీజేపీ మళ్లీ వస్తే శాంతిభద్రతలకు ముప్పు

బీజేపీ మళ్లీ వస్తే శాంతిభద్రతలకు ముప్పు

హైదరాబాద్: దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మతాలు, కులాలు, భాషలు, ఆహారపు అలవాట్ల పేరిట అది ప్రజల మధ్య విషబీజాలు నాటుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మరోసారి కేంద్రంలో గద్దెనెక్కితే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని తెలిపారు. అందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని ఆయన పిలుపు నిచ్చారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ శుక్రవారం రాత్రి నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ప్రధాని మోడీ నిరంకుశ వైఖరిపై సీఎం ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ పార్టీ ఏలుబడిలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన 17 పార్లమెంటు ఎన్నికలు అభివద్ధి, సంక్షేమం కోసం జరిగితే, ప్రస్తుత ఎలక్షన్లు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్నాయని తెలిపారు. 1925లో ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ భావజాలాన్నిదాని రాజకీయ విభాగం బీజేపీ అమలు చేస్తున్నదని వివరించారు. ఇక ఆర్ఎస్ఎస్ భావజాలంలో మిగిలింది రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను రద్దు చేయడమేనని చెప్పారు. వందేండ్లలో అంటే 2025 నాటికి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించడమే దాని లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలు ఎంతో భిన్నమైనవని తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్, అందరికి ఉపయోగపడే రాజ్యాంగాన్ని తీసుకు వచ్చిందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీగా దాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఆ రాజ్యాంగమే దేశానికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతందని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతల కరువై పెట్టుబడులు రావడం లేదని గుర్తుచేశారు.తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వొద్దనీ, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఆరు స్థానాల్లో డిపాజిట్ కోల్పోనుందని రేవంత్ జోస్యం చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనకు భిన్నంగా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని హామీ ఇచ్చారు.బీజేపీ వన్ నేషన్ నినాదాలు, వ్యక్తి కేంద్రంగా జరుగుతున్న పాలన కారణంగా దక్షిణాది రాష్ట్రాలు, ప్రజలు నష్టపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలించిన కాలంలో అన్ని వర్గాలు, అన్ని రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా సమతుల్యతతో కూడిన న్యాయం చేసిందని ఉదహరించారు. సైద్ధాంతికంగా, పాలనపరంగా విబేధాలున్నప్పటికీ తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలించిన దాదాపు 30 ఏండ్ల కాలంలో హైదరాబాద్ కు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయని చెప్పారు. అందుకు భిన్నంగా బీజేపీ అభివృద్ధి నిరోధక మధ్యయుగాల పాలనను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు, ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఖర్చులు పెట్టే దానిపై కమిషన్ వేసి విచారణ జరపాలని ఆయన ప్రధాని మోడీకి ఈ సందర్బంగా సవాల్ విసిరారు. బీజేపీ చేస్తున్న ఆర్భాటపు ప్రచారానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనీ ప్రశ్నించారు?. మహబూబ్ నగర్ ప్రచార సభలో దొంగలను తన పక్కన కూర్చోబెట్టుకున్న మోడీ తనపై చేసే ఆరోపణలు చెల్లబోవని కొట్టిపారేశారు. కేసీఆర్ తమకు స్థానిక ప్రత్యర్థి అనీ, బీజేపీ ఈ రాష్ట్రానికి విజిటింగ్ ప్రొఫెసర్ లాంటిదని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా తాను వ్యాఖ్యానించినట్టు పేర్కొన్న కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ తనపై క్రిమినల్ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ రకంగా బీజేపీ వ్యవస్థలను ఎంతగానో దుర్వినియోగం చేస్తోందని సీఎం వాపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, అన్ని వర్గాల ప్రయోజనాల కోసం మేధావులు, ప్రజలు కాంగ్రెస్తో కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos