కోట (రాజస్థాన్): శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజస్థాన్లోని కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుదాఘాతంతో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఎంబీఎస్ ఆసుపత్రిలో చేర్చారు. తదుపరి చికిత్స కోసం జైపూర్ తరిలిచేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై లోక్సభ స్పీకర్, కోట ఎంపీ ఓం బిర్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులను తగిన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. సంఘటన వివరాలపై కోట ఎస్పీ అమ్రిత దుహన్ మాట్లాడుతూ, ఇది చాలా విచారకర ఘటన అని చెప్పారు. కాళీ బస్తీకి చెందిన కొందరు కలశాలతో ఇక్కడకువచ్చారని, ఒక పిల్లవాడి చేతిలోని 20 ఫీట్ల పైప్ ‘హైటెన్షన్ వైర్’కు తాకడంతో విద్యుత్ షాక్ తగిలిందన్నారు. ఆ పిల్లవాడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడి పిల్లలకు కూడా షాక్ తగిలిందన్నారు. 100 శాతం కాలిన గాయాలతో ఒక చిన్నారి పరిస్థితి ఆందోళకరంగా ఉందని తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా అనే కోణం నుంచి కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. విద్యుత్ షాక్ తగిలిన వారిలో 25 ఏళ్ల ఒక యువకుడు ఉండగా, తక్కిన వారంతా 14 ఏళ్ల లోపు వారేనని వివరించారు.