న్యూ ఢిల్లీ : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం మంగళ వారం విచారణ ఆరంభించింది. ఎస్సీ వర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను రాష్ట్ర అడ్వేకేట్ జనరల్ ప్రస్తుతం వివరిస్తున్నారు. విచారణలో భాగంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకోనుంది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాజ్యాంగం అనుమతిస్తుందా? లేదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం తేల్చనుంది. వర్గీకరణకు రాష్ట్ర శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా?. రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? వంటి వివరాలను ధర్మాసనం తెలుసుకోనుంది. గతంలో ఏపీ కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విధితమే. అయితే వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ అభిప్రాయపడింది. ఉషా మెహ్రా కమిషన్ సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా కేంద్రం నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కమిటీ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.