న్యూ ఢిల్లీ:రాష్ట్రపతి ప్రసంగం దేశంలోని సామాజిక వాస్తవికతతో సంబంధం లేకుండా సాగిందని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంకెలతో నిండిన ప్రసంగం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ప్రభుత్వ విధాన ప్రకటనలో మన దేశం నేడు ఎక్కడుంది? భవిష్యత్తు కోసం విధానాలను ఎలా రూపొందించాలో ప్రభుత్వం వివరిస్తుంది. కానీ రాష్ట్రపతి ప్రసంగంలో అలాంటిదేమీ లేదు. అయోధ్యలోని రామమందిరాన్ని ప్రభుత్వ శ్రేష్ఠతకు ఉదాహరణగా పేర్కొన్న ఈ ప్రసంగం, ఈ దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్వభావానికి విరుద్ధం కాదా? ప్రభుత్వ విజయాలను ప్రస్తావించిన రాష్ట్రపతి, అయోధ్య రామమందిరంతో ప్రజల శతాబ్దాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొనడం దారుణంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్య బీజేపీ పాలనలో దేశం ఏ విధంగా ముందుకు సాగుతుందో స్పష్టంగా తెలియచేస్తోందని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం, రాజ్యాంగంలోని 370వ అధికరణం తొలగింపు, పార్లమెంట్ కార్యక్రమాలను తుంగలో తొక్కడంతోపాటు మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేసిన రాష్ట్రపతి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్షణమని గట్టిగా ప్రకటించినట్లుందని అన్నారు. దేశంలోని మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు చెందిన పేదలు, ప్రజలు అనుభవించే ఏ ఇబ్బందులూ, కష్టాలూ రాష్ట్రపతి ప్రసంగంలోలేవన్నారు. పేదలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు సంబంధం లేదని రాష్ట్రపతి ప్రసంగాన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. ముప్పై రెండు పేజీల విధాన ప్రకటన ప్రసంగంలో కార్మికుడు అనే ఒక్క మాట కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను, దేశ సంపదను అమ్మేసే విధానాన్ని అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఎలా ప్రగతిపథంలో నడిపిస్తుందని ప్రశ్నించారు. అన్ని రంగాల్లోనూ అత్యంత ప్రమాదకరమైన చర్యలు తీసుకుంటున్న మోడీ ప్రభుత్వం దేశాన్ని, ప్రజలను మళ్లీ మళ్లీ కష్టాల్లోకి నెట్టేస్తోందని విమర్శించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రధాన సమస్యల గురించి ప్రస్తావించని రాష్ట్రపతి ప్రసంగం చాలా నిరాశపరిచిందని అన్నారు. సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించని కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుని కార్పొరేట్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనికి తోడు ప్రభుత్వం నేరుగా అమలు చేస్తున్న తీవ్ర విభజన విధానం దేశాన్ని చీకటి యుగానికి నడిపిస్తోందనీ, ఈ పరిస్థితిలో కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ రాష్ట్రపతి ప్రసంగం చేయాల్సి రావడం అతిపెద్ద విడ్డూరమని విమర్శించారు.