యజమాని మోడీనా? మిశ్రానా?

యజమాని మోడీనా? మిశ్రానా?

న్యూఢిల్లీ : ఈనెల 22న అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనున్నది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ట కోసం ఆచార కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య యజమానుల లాగా మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే, ప్రాణ ప్రతిష్టను పర్యవేక్షించే పూజారులు, ఆలయ ట్రస్ట్ చీఫ్తో సహా ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైన వ్యక్తులు జనవరి 22న యజమానిగా మోడీ ఉంటారా? లేదా మిశ్రా ఉంటారా? అనే దానిపై పరస్పర విరుద్ధమైన స్వరంతో మాట్లాడారు. లౌకిక దేశంగా ఉన్న భారత్కు ప్రధానిగా ఉన్నప్పటికీ, 2020 ఆగస్టులో జరిగిన ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ యజమానిగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇటీవల, ప్రతిపక్ష పార్టీలు, హిందూత్వ మద్దతుదారులు కూడా ప్రధాని ఆలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన విషయం విదితమే.
‘మోడీ ప్రధాన కర్మలు నిర్వహిస్తారు’
ఈ నెల 22న జరిగే వేడుకకు మోడీ ప్రధాన కర్మలు నిర్వహిస్తారని ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ విలేకరులతో చెప్పారు. వేడుక సమయంలో ముఖ్య యజమాని ఎవరు అన్న ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ.. ‘మోడీ అన్ని రోజులూ ఆచారాల నిర్వహణకు అందు బాటులో ఉండరు. కాబట్టి ఈ బాధ్యత మనం మరెవరికైనా ఇవ్వాలి’ అని ఆయన తెలిపారు. ‘మొదటి రోజు యజమాని అయిన వ్యక్తే 22 వరకు ఉంటారు’ అయితే దీక్షిత్ వ్యాఖ్యలు మాత్రం ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించే ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రకు చెందిన ప్రధాన కార్యదర్శి చంపత్ రారు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయి. మోడీ యజమాని కాదనీ, ఎందుకంటే నియమించబడిన వ్యక్తి ఎనిమిది రోజుల పాటు కర్మలను నిర్వహించాల్సి ఉంటుందని డిసెంబరు 17న ఒక వార్తా ఛానెల్తో మాట్లాడుతూ చంపత్ రాయ్ స్పష్టం చేశారు. మొదటి రోజున యజమానిగా అయిన వ్యక్తే 22వ తేదీ వరకు యజమానిగా కొనసాగుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఆరెస్సెస్, ఆలయ ట్రస్ట్ సభ్యుడు మిశ్రాను యజమానిగా నియమించారు. ఆయన తన భార్య ఉషా మిశ్రాతో కలిసి ఆచారాలను నిర్వహించటం ప్రారంభించారు. ప్రాణప్రతిష్టను పర్యవేక్షించే పూజారి గణేశ్వర్ శాస్త్రి మాట్లాడుతూ.. ”బ్రాహ్మణ దంపతులు మిశ్రాలు యజమానులుగా ఉంటారు. అన్ని ఆచారాలను వారే నిర్వహిస్తారు. మిశ్రాతో పాటు మోడీ, ఇతరులు హాజరవుతారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మిశ్రా ‘ముఖ్య(ప్రధాన) యజమాని’గా ఉంటారనీ, మోడీ ‘ప్రతీకాత్మక యజమాని’గా ఉంటారని పూజారులు శాస్త్రి, దీక్షిత్లు తెలిపారు. మోడీ ప్రధాన అతిథిగా ఉంటారనీ, పవిత్రోత్సవానికి ముందు వారం మొత్తం ప్రధాని అందుబాటులో లేనందున జనవరి 22కి ముందు ఆచారాలను మిశ్రా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. ముఖ్య యజమాని లేని సమయంలో ప్రధాన అతిధేయుడు ప్రాణప్రతిష్ట వేడుకకు కూర్చోవటానికి ముందు కొన్ని ఆచారాలను కూడా నిర్వహించాలి. మోడీ ఈ ఆచారాలను ఆచరించటం లేదనీ, అందుకే ఆయన ముఖ్య యజమానిగా ఉండరని అన్నారు. ‘ప్రతి యజమానీ ప్రాయశ్చిత్ (పాపాలను వదిలించుకోవటానికి చేసే మతపరమైన చర్య), సంకల్పం(పూజలు నిర్వహించటానికి అనుమతిని అభ్యర్థించటం) ఆచారాలను నిర్వహించాలి. యజమాని కూడా గృహస్థుడై (కుటుంబాన్ని కలిగి ఉన్న వ్యక్తి) ఉండాలి. ఈ షరతులన్నింటినీ నెరవేర్చినందున మిశ్రాను ఎంపిక చేశారు’ అని ఆయన తెలిపారు.
మోడీ కూడా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగమవుతారనీ, అయితే కేవలం రాముడి విగ్రహం కండ్లను మాత్రమే ఆవిష్కరిస్తారని చెప్పారు. మిశ్రా అన్ని ఇతర కర్మలను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగమైన పూజారులు, ఇతర వ్యక్తులు యజమాని విషయంలో విరుద్ధమైన ప్రకటనలు గందరగోళానికి దారి తీశాయి. ఇటు మీడియాలో కూడా యజమాని ఎవరు అనేదానిపై స్పష్టత కనబడటం లేదు.

తాజా సమాచారం