హైదరాబాదు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్ చేసి తుంటి ఎముక రీప్లేస్ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలంటూ సీఎం ఆదేశం..
మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దవాఖానలో చేరారు. గురువారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయనున్నారు.కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. కేసీఆర్పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.