అమరావతి : ప్రవాసాంధ్రుడు, కోస్టల్‌బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మిస్టరీ వీడుతోంది. ఆయనను హైదరాబాద్‌లోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిగా పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.
ఇంజక్షన్ ఎలా ఇచ్చారో తేలాలి
జయరాం హత్యకు ముందు పెంపుడు జంతువులను(కుక్కలను) చంపేందుకు ఇచ్చే మత్తు ఇంజక్షన్ వాడినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిసింది. ఈ ఇంజక్షన్ ఎలా చేశారనేది తేలాల్సి ఉంది. ఆదివారం కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, నందిగామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో శిఖాచౌదరి, రాకేష్‌రెడ్డి, అతని స్నేహితులను విచారించారు. హత్యకు దారితీసిన కారణాలు, ఏ విధంగా హత్య చేశారనే విషయంపై పోలీసు అధికారులు రాకేష్‌రెడ్డి వద్ద నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
మామతో సంబంధం నా వ్యక్తిగతం
రాకేష్‌రెడ్డితో తనకు పరిచయం ఉందని, మామ జయరాంకు తానే ఆయనను పరిచయం చేశానని శిఖా చౌదరి విచారణలో పేర్కొంటున్నట్లు సమాచారం. జయరాంకు రాకేష్‌రెడ్డి రూ.4.5కోట్లు అప్పుగా ఇచ్చారని, ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదని దానివల్లే తరుచూ వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనను హతమార్చారని, తనకు దీంతో ఎటువంటి ప్రమేయం లేదని చెప్పినట్లు సమాచారం. తన అత్త.. జయరాంకు చెక్ పవర్ లేకుండా చేసిందని, అందువల్ల తమకు ఆర్థిక సమస్యలు వచ్చినట్లు తెలిపింది. తన మామతో తనకు సాన్నిహిత్యం ఉందని, అది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్యకు ప్రధానంగా రూ.4.5 కోట్ల ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించారని, సోమవారం నిందితుల అరెస్ట్ చూపించే అవకాశంఉందని తెలిసింది.
కిరాయి హంతకులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు?
మరోపక్క కృష్ణా జిల్లా పోలీసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బంధువులుఆరోపిస్తున్నారు. కీలక నిందితుల ప్రమేయాన్ని తప్పించి కిరాయి హంతకులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహారం, రూ.కోట్లతో ముడిపడిన హత్య కావడంతో కొంత మంది ప్రలోభాలకు లొంగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసు విచారణకు మొత్తం 10 బృందాలను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే వాదన ఉంది.
ఫొటో ఇచ్చిన కానిస్టేబుల్‌కు వీఆర్
కంచికచర్ల సీఐ కార్యాలయంలో ఉన్న శిఖా చౌదరి ఫొటోను శనివారం రాత్రి బయటకు ఇచ్చిన నందిగామ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను ఎస్పీ వెంటనే వీఆర్‌లోకి పంపారు.
శిఖాను కలిసిన సినీ నిర్మాత
శనివారం రాత్రి ఓ సినిమా నిర్మాతగా భావిస్తున్న వ్యక్తి శిఖా చౌదరి తల్లితో కలిసి కంచికచర్ల వచ్చి ఆమెను కలిశారు. అనంతరం ఆమె బీఎండబ్ల్యూ కారును సీఐ కార్యాలయం వద్ద నుంచి తీసుకెళ్లారు. ఆయనతో పాటు శిఖా తల్లి సైతం వెళ్లిపోయారు.