ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. విజయనగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలోనే అని, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి, ఎన్టీఆర్ ని మోసం చేసి పార్టీ పగ్గాలను చేజిక్కుంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఆపై ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరిన చంద్రబాబు బయటకొచ్చేశారని అన్నారు. 2019లో మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయమని, మళ్లీ ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు ప్రయత్నిస్తే కనుక తాము రానివ్వమని స్పష్టం చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ను సీఎం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించిన అమిత్ షా, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా ఆ ప్రాంతానికి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం అందించిందని భాజపా అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ఏపీలో భాజపా చేపట్టిన బస్సు యాత్రను ప్రారభించడానికి వచ్చిన అమిత్ షా విజయనగరంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసిందంటూ రాష్ట్రంలో అధికార తెదేపా, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం అందించిందని వెల్లడించారు. కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రాజెక్టులను, ఆంధ్రప్రదేశ్‌కు చేకూరిన ప్రయోజనాన్ని వివరించారు. సభలో ఆయన మాట్లాడుతూ కీలకమైన 14అంశాల్లో పది పూర్తి చేశామన్నారు. గుంటూరుకు ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశామని వెల్లడించారు. విశాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యూకేషన్, పెట్రోలియం విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం వంటి కీలక విద్యాసంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. జాతీయస్థాయిలో ఖ్యాతిగాంచిన 20 సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చామని వెల్లడించారు. రెవెన్యూ, ఆర్థిక లోటును కూడా కేంద్రం తరఫున భర్తీ చేసినట్లు అమిత్‌షా తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద రూ.6100 కోట్లు, ముద్ర యోజన కింద రూ.21వేల కోట్లు, భారత్‌మాల ప్రాజెక్టు కింద రూ.44వేల కోట్లు ఇలా మొత్తం అన్నీ కలిపి రూ.5,56,985కోట్లు రాష్ట్రానికి సాయంగా అందజేశామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ చేసిన సాయాన్ని, ఇప్పడు భాజపా చేసిన సాయాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా సాయం అందించిన భాజపాను కాదని కాంగ్రెస్‌ను ఎందుకు ఆశ్రయించారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు అభివృద్ధికి సంబంధంలేదని, ఆయనకు అవినీతికి మాత్రమే అవినాభావ సంబంధం ఉందని అమిత్ షా విమర్శించారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు.
గతంలో మేం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ స్వయానా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు. తెదేపా చేపట్టిన రాజధాని నిర్మాణం, పోలవరం వివిధ పథకాల్లో జరుగుతున్న అవినీతినితో ప్రజలు వ్యతిరేక వస్తోందని గమనించిన చంద్రబాబు భాజపాపై బురదజల్లి కాంగ్రెస్ పంచన చేరారని ఆరోపించారు. రూ.5లక్షల వరకు ఆదాయమున్న వారందరికీ పన్ను రిబేట్ ఇచ్చామన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని 2019ఎన్నికల్లో ప్రతి కార్యకర్త భాజపా చేపట్టిన సంక్షేమపథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించి మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.