హైదరాబాద్: ‘‘ఏమీ ఎరుగని పువ్వుల్లారా.. ఐదారేడుల పాపల్లారా’’ అంటూ మహాప్రస్థానం ‘శైశవగీతి’ కవితలో చిన్నారుల గురించి శ్రీశ్రీ వర్ణిస్తాడు. ‘మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకసమున హరివిల్లు విరిస్తే.. అవి మీకేనని ఆనందించే.. కూనల్లారా!’ అంటూ వాళ్ల సంతోషాన్ని కవితాత్మకంగా చెబుతాడు. అలాంటి చిన్నారుల ముఖాల్లో కనిపించే ఆనందాన్ని ఆస్వాదించని వారు ఎవరైనా ఉంటారా? తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. కొంతమంది చిన్నారులు సెల్ఫీ కోసం ఫోజు పెట్టిన సందర్భం అది. ముఖమంతా నింపుకున్న నవ్వులతో ఆ చిన్నారులు చాలా అందంగా ఉన్నారు. ఫొటోకైతే సెల్ఫీ ఫోజు పెట్టారు కానీ.. వాళ్ల దగ్గర మొబైల్ లేదు. అదే ఈ సెల్ఫీ ఫొటో ప్రత్యేకత. చెప్పును చేతికి తగిలించుకుని.. మొబైల్ పట్టుకున్నట్టు.. ఓ చిన్నారి ముందు నిలుచోగా.. మిగిలిన చిన్నారులు సెల్ఫీకి రెడీ అయినట్టుగా నిలబడ్డారు. వాళ్లలోని అమాయకత్వం.. నిర్మలమైన నవ్వులు.. చూసినవారికి కంటినిండా సంతోషాన్ని అందిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని ఎవరో తమ కెమేరాలో బంధించి .. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది.