న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈవీఎం వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సహా 22 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం అందించనున్నాయి. ‘‘రాజ్యంగాన్ని, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడడం’’లో భాగంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల సంఘంతో సమావేశం కానున్నట్టు టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు. ‘‘ అన్ని ప్రతిపక్ష పార్టీలతోనూ మేము చర్చించాం. ఈ అంశంపై ముందుకెళ్లాలని నిర్ణయించాం. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ఫెడరల్ స్ఫూర్తిని మనం కాపాడాలి. ఇవాళ మధ్యాహ్నం ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనున్నాయి…’’ అని ఒబ్రెయిన్ పేర్కొన్నారు. కాగా ఇదే విషయాన్ని ఇవాళ ఉదయం పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ధ్రువీకరించారు. ఈవీఎంల వ్యవహారంపై సోమవారం ఈసీ ముందుకు వెళ్లనున్నట్టు ప్రతిపక్షాలు శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ నేత సతిశ్ చంద్ర మిశ్రా, డీఎంకే నేత కనిమొళి, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నుంచి డి. రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.