కొచ్చి: సాధారణంగా రైతులు మార్కెట్లకు ఆటో, వ్యాన్, బైక్, రిక్షాల్లో తమ ఉత్పత్తులను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే, కేరళ కు చెందిన ఓ రైతు మాత్రం లగ్జరీ కారులో మార్కెట్కు వెళ్లి.. తన పంటను అమ్ముకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. సుజీత్ అనే రైతు దాదాపు పదేళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను పండించిన ఆకు కూరలు, కూరగాయలను రోడ్డుపక్కన మార్కెట్ కు తీసుకెళ్లి స్వయంగా విక్రయిస్తున్నాడు. అయితే, అతడు ఎవరూ ఊహించని విధంగా ఆడీ ఏ4 లగ్జరీ కారులో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏదో బిజినెస్ మ్యాన్ మాదిరి వచ్చిన ఆ రైతు, మార్కెట్ వద్ద పంచను తీసేసి షాట్తో రైతుగా మారిపోతాడు. తను తెచ్చిన ఆకుకూరలను మార్కెట్లో ఓ దగ్గర ఉంచి విక్రయిస్తాడు. అమ్మడం పూర్తవగానే మళ్లీ పంచ కట్టుకుని కారులో వెళ్లిపోతాడు.