బెంగళూరు: ఇస్రో సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకనుభూమికి సుమారు 15 లక్షల కి. మీ దూరంలోని ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. నౌక భూ కక్ష్యను ఇప్పటికి నాలుగుసార్లు పెంచిన విషయం తెలిసిందే. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-ఎల్1ను మరొక విన్యాసంతో ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. కాగా, ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో ఆదిత్య ఎల్1 తొలి లగ్రాంజ్ పాయింట్‌కు వెళ్తున్నది. ఇది భూమితోపాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆదిత్యుడి పరిశీలనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలుంటుంది. ఈ కేంద్రం నుంచే ఆదిత్య ఎల్1 సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది. ఈ నెల 2 ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ (PSLV-C57) ద్వార ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మరుసటి రోజే మొదటి కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ తరఫున సూర్యుడి అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే కావడం విశేషం.