అమరావతి: పశ్చిమ బెంగాల్లో సీబీఐ చర్య దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్ర దుశ్చర్యను ఖండిస్తున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతా ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సంఘటనలను అందరూ ఖండించాలని, మమతా బెనర్జీకి సంఘీభావంగా ఉండాలని పిలుపునిచ్చారు. కోల్కతా ర్యాలీ విజయవంతమైందనే మమతపై మోదీ కక్ష సాధింపు అని ఆరోపించారు. బీజేపీకి లొంగిపోయిన వారిపై కేసులు ఎత్తివేస్తున్నారని, బీజేపీని ఎదిరిస్తే పాతకేసులు బయటకు తీస్తున్నారని మండిపడ్డారు. మొన్న అఖిలేష్, మాయావతిపై, ఇప్పుడు మమతాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రాల అధికారాలను హరించేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పూర్తిగా దిగజారుస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలందరిపై కేసులుపెట్టి బీజేపీ ఆనందిస్తోందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని, వ్యవస్థలను పతనం చేస్తున్నారని దుయ్యబట్టారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలో అంశమని చెప్పారు. కోడికత్తి కేసు ఎన్ఐఏకు అప్పగించడం బీజేపీ కుట్ర అని ఆరపించారు. టీమ్ ఇండియా అన్నారు, ఫెడరల్ ఇండియా అన్నారు…ఆకర్షణీయ నినాదాలే తప్ప ఆచరణ శూన్యమన్నారు. సీబీఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారని, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నిరంకుశ పోకడలను అందరూ ఖండించాలని తెలిపారు. పార్టీలను సమన్వయం చేస్తున్నామని, జాతీయ నేతలతో మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో దీనిపైనే చర్చిస్తామన్నారు. దేశస్థాయిలో ఉద్యమానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. తితలీ తుపానుకు శ్రీకాకుళం విధ్వంసమైతే అమిత్ షా రాలేదన్న బాబు నాలుగు నెలల తరువాత వచ్చి ఏం చూద్దామని, ఏం చేద్దామని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడొస్తున్నారని నిలదీశారు. ప్రజల నిరసనల తీవ్రతను మోదీ, షా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అమిత్ షా పలాస పర్యటన రాజకీయ స్వార్థమే అని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నేతలకు ఆదేశించారు. బీజేపీయేతర పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని, ఈ విషయం తెలిసే జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. మోదీ కనుసన్నల్లో ఈసీని కలిసి ఫిర్యాదు అని జగన్ నాటకమాడుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో గోవిందరాజుల స్వామి ఆలయంలో చోరీ ఉపేక్షించేది లేదని చెప్పారు. నిన్న హైకోర్టు నిర్మాణంతో నవ్యాంధ్రలో నవశకం చాటామన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.