గుంటూరు: పవన్తో సఖ్యత విషయంలో భాజపా రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘పవన్తో సమన్వయం చేసుకోవడంలో సోమువీర్రాజు విఫలమయ్యారు. ఆయన వల్లే ఏపీ బీజేపీలో సమస్య. ఆయన ఒక్కడే అన్నీ చూసుకోవడం వల్లే పార్టీలో సమస్య తలెత్తింది. బీజేపీలో అసలేం జరుగుతోందో మాకూ తెలియట్లేదు. బీజేపీ బలోపేతానికి హైకమాండ్ దృష్టి సారించాల’న్నారు. అధిష్టానం పవన్ను తేలిగ్గా తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేన బీజేపీకి దూరమైందని కన్నా లాంటి పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే కన్నా ప్రముఖ నేతలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. అక్కడ కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ‘బీజేపీ అంటే నాకు గౌరవం. అలాగని నా స్థాయిని నేను చంపుకోను. బీజేపీతో స్నేహం కుదిరినా బలంగా పని చేయలేకపోయాం. అది బీజేపీ నాయకులకూ, నాకూ తెలుసు. కలిసి వెళ్లేటప్పుడు ప్రణాళిక ఇవ్వకపోతే కాలం గడిచిపోతుంది. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే ప్రజల్ని రక్షించుకోవడానికి నేను నా వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుంది. తప్పడం లేదు. బీజేపీకి, ప్రధాన మంత్రికి నేను వ్యతిరేకం కాదు. నాకు గౌరవం ఉంది. ఎప్పుడూ కలుస్తాం. అలా అని చెప్పి ఊడిగం చేయం’’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ తమతో కలిసి నడుస్తారని భావించిన బీజేపీ నేతలు కంగుతిన్నారు.