న్యూ ఢిల్లీ: కొలీజియం వ్యవస్థ వల్ల ప్రజలు కూడా సంతోషంగా లేరని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజుజు సంతోషంగా లేరని చెప్పారు. ‘కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజలు సంతోషంగా లేరు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా న్యాయ మూర్తులను నియమించడమే ప్రభుత్వం పని. సగం మంది న్యాయమూర్తులు నియామకాల్లోనే నిమగ్నమై ఉన్నారు. దీనివల్ల వారి న్యాయం అందించే ప్రాథమిక విధికి ఇబ్బంది అవుతుంద’ని –పాంచజన్య వారపత్రిక నిర్వహించిన ‘సబర్మతి సంవాద్’ లో ఆయన ప్రసంగించారు. గత నెల ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక సదస్సులో కూడా కొలీజియం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై అడిగిన ప్రశ్నకు రిజిజు స్పందిస్తూ.. 1993 వరకు భారతదేశంలోని ప్రతీ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి న్యాయ మంత్రిత్వ శాఖ నియమించిందని తెలిపారు. ఆ సమయంలో మనకు చాలా మంది ప్రముఖ న్యాయమూర్తులు ఉన్నారని చెప్పారు. ‘రాజ్యాంగంలో దీనిపై పూర్తి స్పష్టత ఉంది. రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారు. అంటే న్యాయ మంత్రిత్వ శాఖ భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి న్యాయమూర్తులను నియమిస్తుంది. మీడియాను పర్యవేక్షించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నట్లే న్యాయవ్యవస్థను పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. ఇందులో న్యాయవ్యవస్థ కూడా చొరవ తీసుకుంటే మంచిద’ని అభిప్రాయపడ్డారు.