న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019-20 తాత్కాలిక బడ్జెట్‌ను రెండవ ‘సర్జికల్ దాడి’గా బీజేపీ నేతలు అభివర్ణిస్తుండటాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది. ‘ఇది ఇండియా, పాకిస్థాన్ కాదు’ అని విరుచుకుపడింది. ఇలాంటి పదాలు వాడకుండా ప్రభుత్వం సంయమనం పాటించాలని హితవు పలికింది. ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, రైతులకు రోజుకు రూ.17 రూపాయలు ఇవ్వడాన్ని సర్జికల్ దాడులుగా పరిగణించలేమన్నారు. ‘మీరు (కేంద్రం) రైతు రుణాలు మాఫీ చేశారా? బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేశారు. రైతులకు రోజుకు రూ.17 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని సర్జికల్ స్టైక్స్గా చెప్పుకుంటున్నారు. ఇదేమైనా పాకిస్థానా? ఇది ఇండియా. అది మరచిపోవద్దు. కనీసం అలాంటి పదాలు వాడటమైనా మానేయాలి’ అని ఆయన అన్నారు. అంతకుముందు, బడ్జెట్‌పై కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాస్ స్పందిస్తూ, 2019 బడ్జెట్‌ను రెండో సర్జికల్ స్ట్రైక్‌గా అభివర్ణించారు.