దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

నూహ్ : కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై దాడి చేసిన సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. “కేంద్రం మూడు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. భాజపాలో విచారించాల్సిన వ్యక్తులు లేరా? నేను పది మంది పేర్లను ఇస్తాను. వారందరిపైనా విచారణ చేయండి. అవసరమైతే నాపైన కూడా విచారణ జరిపించండి’అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోతే రైతులు మళ్లీ ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. రైతులను మనం భయపెట్టలేమని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఎలాగైనా సాధిస్తారని మాలిక్ ఆశించారు. మొదట్లో రైతు ఆందోళనలను ప్రధాని మోదీ తేలికగా తీసుకున్నారని చెప్పారు. మీరు వెనక్కి తగ్గినప్పుడే రైతులు వెళ్లిపోతారని ఆయనకు (మోదీకి) చెప్పానని మాలిక్ తెలిపారు. చివరకు ఆయన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైందని.. జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందన్నారు.

తాజా సమాచారం