న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ఈనెల 16వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయకుండా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన క్లయింట్‌పై రాజకీయ ప్రతీకారానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని వాద్రా తరఫు న్యాయవాది కేటీ తులసి మీడియాకు తెలిపారు. రాజస్థాన్ హైకోర్టు ఇప్పటికే వాద్రాకు ఇన్‌టర్మ్ రిలీఫ్ ఇచ్చిందని, ఆయనకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, స్థలాల వివరాలను కూడా గతంలోనే కోర్టుకు సమర్పించామని చెప్పారు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ రాబర్ట్ వాద్రా శుక్రవారంనాడు కోర్టును ఆశ్రయించారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుడనని, తప్పుడు ప్రాసిక్యూషన్‌కు తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు. లండన్‌కు చెందిన ఆస్తి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలను వాద్రా ఎదుర్కొంటున్నారు.