పాట్నా: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చుతూ బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చింపివేశారు. రాహుల్ గాంధీ ‘‘నడయాడుతున్న రాముడి అవతారం’’ అని పేర్కొంటూ కొద్ది రోజుల క్రితమే పాట్నాలో ఈ పోస్టర్లు వెలిశాయి. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతల ఫోటోలు వీటిపై ముద్రించారు. ‘‘వాళ్లు కేవలం రామ నామ జపం చేస్తారు.. కానీ మీరు మాత్రం రాముడిలా ఉండండి..’’ అంటూ ఈ పోస్టర్లలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యంగా నినాదాలు రాశారు. కాంగ్రెస్ చీఫ్‌ని రాముడితో పోల్చి హిందువుల మనోభావాలను గాయపర్చారంటూ రాహుల్, బీహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ ఝా సహా మరో నలుగురు నేతలపై పాట్నా సివిల్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. అధికార జేడీయూ-బీజేపీ నేతలు సైతం ఈ పోస్టర్లపై తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘గాంధీ వారసత్వ పార్టీ చేస్తున్న చౌకబారు రాజకీయాలకు ఇదే నిదర్శనం..’’ అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రేపు పాట్నాలోని గాంధీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ‘జన ఆకాంక్ష ర్యాలీ’కి రాహుల్ గాంధీ హాజరుకానున్న తరుణంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.