అమరావతి: నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవర్తించిన తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని, ఆయన ప్రవర్తన చూస్తే ‘పిచ్చి పీక్స్’ చేరినట్టు తెలుస్తోందని జీవీఎల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మహా ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం ‘అసెంబ్లీ రౌడీ’లాగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. సీఎం తీరుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
అయితే జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. సభానాయకుడిని అసెంబ్లీ రౌడీ అంటూ ఎలా సంబోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఎదిరిస్తున్నందుకే సీఎంను రౌడీ అంటున్నారా? అంటూ నిలదీస్తున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జీవీఎల్‌పై ఈ నెల 5న అసెంబ్లీలో ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన శుక్రవారం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి నల్లటి దుస్తుల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రానికి బీజేపీ నేతలు ఊడిగం చేస్తున్నారంటూ ఊగిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టిని బీజేపీ ఎమ్మెల్యేలంతా ప్రజాప్రతినిధులుగా అనర్హులని చంద్రబాబు మండిపడ్డారు
.అంత మాటంటారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అసెంబ్లీ రౌడీ అని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించడాన్ని టీడీపీ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈనెల 5వ తేదీన జీవీఎల్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణకుమార్‌రాజుతో ప్రవర్తించిన తీరు చూస్తే ఆయన పిచ్చి పీక్స్‌కు చేరిందని, ఫ్రస్టేషన్లో ఉన్న చంద్రబాబు అసెంబ్లీ రౌడీ ప్రవర్తించారని నిన్న జీవీఎల్ వ్యాఖ్యానించారు.