న్యూ ఢిల్లీ: ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని మాట్లాడాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. ‘ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలి. వివిధ రాష్ట్రాల వారి సంభాషణలు భారత భాషలో ఉండాలి. ప్రాంతీయ భాషల పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాలి. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుంద’న్నారు.10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రతి పాదనను అసోం, బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. భాషా ఆధిపత్యాన్ని సహించబోమన్నారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దే ప్రయత్నమని విమర్శించారు. హిందీని బలవంతంగా రుద్దడం మాని స్థానిక భాషలను పరిరక్షణ, ప్రోత్సహాలపై దృష్టి పెట్టాలని అసోం సాహిత్య సభ కోరింది. అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. ‘నాకు హిందీ తెలియదు’ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విటర్ ద్వారా నిరసించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ మినహా ప్రతి రాష్ట్రానికి స్వంత భాష ఉందని వెల్లడించారు. అలాంటప్పుడు హిందీని అన్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదన్నారు. భాష అనేది కేవలం సంభాషణ సాధనమేకాదు. . సంస్కృతి, గుర్తింపు కూడా. భాషా వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఏక భాష విధానం సమర్థనీయం కాదని కుండ బద్దలు కొట్టారు.