టీఆర్‌ఎస్ కీలకనేత హరీష్‌రావ్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు టీఆర్‌ఎస్ పార్టీలో
ఏదో జరుగుతోందనే అనుమానాలకు తావిస్తున్నాయి.ఆర్టీసీ టీఎంయూ గౌరావధ్యక్ష్య పదవికి రాజీనామా
చేసి 24 గంటలు కూడా గడవక ముందే బంజారాహిల్స్ రోడ్‌నం 12లోనున్న అధికారిక బంగ్లాను
ఖాళీ చేసి కొండాపూర్‌లో సొంత ఇంటికి వెళ్లిపోవడంతో టీఆర్‌ఎస్ నేతలను ఒకింత షాక్‌కు
గురి చేసింది. తెలంగాణ ప్రభుత్వంలో మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల మధ్య హరీష్ రావు ఇలా వరుసగా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. మంత్రివర్గంలో ఈసారి హరీష్ కు చోటుదక్కకపోవచ్చనే ఊహాగానాల మధ్య తన అధికారిక నివాసాన్ని హరీష్ ఖాళీ చేయడం పుకార్లకు మరింత ఊతమిచ్చింది.మంత్రివర్గంలో హరీష్ కు చోటుదక్కదేమో అనే అనుమానాలతో పాటు ఒంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ ఎస్ చేరిక కూడా హరీష్ కోపానికి కారణంగా తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు ఒంటేరు. ఆ టైమ్ లో కేసీఆర్ తరఫున ప్రచారం చేసిన హరీష్ రావుకు – ప్రతాప్ రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. కట్ చేస్తే.. నెల రోజులు కూడా గడవకముందే ఒంటేరును పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఆ చేరిక కార్యక్రమంలో కూడా హరీష్ పాల్గొనలేదు. ఇలాంటి పలు కారణాలన్నీ కలిసి హరీష్ ను హర్ట్ చేశాయని అంటున్నారు ఆయన సన్నిహితులు.