డిపోలకే పరిమితమైన బస్సులు….

డిపోలకే పరిమితమైన బస్సులు….

విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేకహోదా,విభజన హామీల సాధన సమితి పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.బంద్‌కు కాంగ్రెస్‌,తెలుగుదేశం,వామపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు,ఆర్టీసీ యూనియన్లు కూడా మద్దతు తెలిపాయి.శుక్రవారం ఉదయం నుంచే కాంగ్రెస్‌,తెదేపా,వామపక్షాల పార్టీల నేతలు రోడ్లపై బైఠాయించి నిరసనల్లో పాల్గొన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా,విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్షాలు,విద్యార్థి సంఘాలు నిరసనలు చేసాయి. విజయవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు సీపీఐ నేతలు నిరసనకు దిగారు. రాజమహేంద్రవరంలో సీపీఐ, గుంటూరులో కాంగ్రెస్‌, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బంద్‌కు సంఘీభావంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరుకానున్నారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ప్రైవేటు పాఠశాల, కళాశాల సంఘాలు కూడా బంద్‌కు సంఘీభావం తెలిపాయి. బంద్‌ సందర్భంగా జరిగే ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో తెదేపా నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొంటారు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నట్లు అమరావతి ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఏపీఎన్‌జీవో సంఘం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌కు భాజపా, వైకాపా, జనసేన దూరంగా ఉండనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos