మాయవతికీ ఈడీ కష్టాలు

మాయవతికీ ఈడీ కష్టాలు

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో పాత కుంభకోణాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హయాం నాటి గనుల తవ్వకాల కుంభకోణంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మాయావతి అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న స్మారకాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు జరిపారు. 2007-12 మధ్య మాయావతి యూపీ సీఎంగా ఉన్న సమయంలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌, పార్టీ గుర్తు ఏనుగు లాంటి అనేక స్మారకాలను నిర్మించారు. అయితే స్మారకాల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందని, కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు వ్యక్తులు లబ్ధి పొందినట్లు రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. లఖ్‌నవూలోని కొందరు అధికారులు, ప్రయివేటు వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల అఖిలేశ్‌ యాదవ్‌ హాయం నాటి మైనింగ్‌ కుంభకోణం కేసులో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఏఎస్‌ అధికారిణి నివాసం సహా పలు అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. కాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా యూపీలో సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ తమ వైరాన్ని సైతం పక్కనబెట్టి చేతులు కలిపాయి. మహాకూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌, మాయావతి హయాం నాటి కుంభకోణాలపై ఈడీ సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos