న్యూఢిల్లీ: నవ భారతదేశ నిర్మాణం దిశగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో మా ప్రభుత్వం నవ భారత నిర్మాణం దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఈ నూతన భారతదేశంలో… ప్రతి ఒక్క పౌరుడు ప్రాథమిక సౌకర్యాలు అందుకుంటాడు. ప్రతి పౌరుడికి తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుంది. ప్రతి పిల్లాడికీ ఎలాంటి లోటు లేకుండా జీవన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రతి ఆడబిడ్డా నిర్భయంగా జీవిస్తుంది. ప్రతి ఒక్కరికీ గౌరవంగా న్యాయం జరుగుతుంది. యావత్ ప్రపంచమే గౌరవించేలా నవ భారతదేశం సగర్వంగా నిలబడుతుంది… ’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.