పేరుకే ఉప ముఖ్య‌మంత్రి : అడుగ‌డుగునా అవ‌మాన భారం : అసంతృప్తిలో కెఇ…!

పేరుకే ఉప ముఖ్య‌మంత్రి : అడుగ‌డుగునా అవ‌మాన భారం : అసంతృప్తిలో కెఇ…!

ముఖ్య‌మంత్రి స‌మ‌కాలీకులు. రాయ‌ల‌సీమ‌లో సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌. పేరుకు ఉప ముఖ్య‌మంత్రి హోదా. కానీ, ఆ ప‌ద‌వి స్వ‌కరించిన నాటి నుండి ఏనాడు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేదనే ఆవేద‌న‌. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం.. ఆర్డీఓ ల బ‌దిలీలు..క‌ర్నూలు జిల్లా పార్టీలో చేరిక‌లు..రాజ‌ధాని లో శ్రీవారి ఆల‌య ప‌నుల ప్రారంభోత్సవానికి అందని ఆహ్వానం ..ఇలా ఎన్నో అవ‌మానాలు. ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న కెఇ కృష్ణ‌మూర్తి అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతున్నాయి.
పేరుకే ఉప ముఖ్య‌మంత్రి..
2014 లో రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపిలో టిడిపి అధికారంలోకి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన బిసి నేత‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని నిర్ణ‌యించారు. రాయల‌సీమ లో సీనియ‌ర్ అయిన కెఇ కృష్ణ‌మూర్తికి ఉప ముఖ్య‌మంత్రి హోదా ఇచ్చి రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే ష‌న్ల శాఖ‌ను అప్ప‌గించారు. పేరుకు రెవిన్యూ మంత్రిగా ఉన్నా..కీల‌క‌మైన రాజ‌ధాని వ్య‌వ‌హారం..అక్క‌డ భూ స‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారం మొత్తం మున్సిప‌ల్ శాఖా మంత్రి ప‌ర్య‌వేక్షించారు. గుంటూరు జిల్లా నేత‌ల స‌హ‌కారంతో మొత్తం వ్య‌వ‌హారం న‌డిచింది. రెవిన్యూ మంత్రిగా ఎక్క‌డా కెఇ కి అక్క‌డి భూముల వ్య‌వ‌హారంలో జోక్యం లేదు. నాటి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య దర్శికి ఆ వ్య‌వ‌హారంలో సంబంధం లేకుండా మున్సిప‌ల్ శాఖ అధికారులు పూర్త‌గా నిమ‌గ్న‌మ‌య్యారు. దీని పై ఎంతో కాలంగా కెఇ అసంతృప్తితో ఉన్నారు.

ఆర్డీవో బ‌దిలీల ర‌ద్దు.. జిల్లా టిడిపి లో చేరిక‌లు..
రెవిన్యూ శాఖ మంత్రిగా ఆయ‌న తీసుకున్న ఆర్డీఓ బ‌దిలీల వ్య‌వ‌హారం పై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. ప‌లువు రు మంత్రులు ఆర్డీఓల బ‌దిలీల పై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. ఒక మంత్రి ఏకంగా సీయం పేషీలోనే ఆర్డీఓ బ‌దిలీ వ్య‌వ‌హారం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కెఇ చేసిన ఆర్డీవో బ‌దిలీల‌ను ర‌ద్దు చేస్తూ అప్ప‌ట్లో నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, రాజ‌కీయంగా క‌ర్నూలు జిల్లాలో కెఇ కుటుంబం పార్టీ కోసం ఎవ‌రితో పోరాడుతూ వ‌స్తుందో వారిని టిడిపిలోకి తీసుక కోవ‌టం పై కెఇ లోలోప‌ల అసంతృప్తితో ఉన్నారు. అయినా ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా నోరు విప్ప‌లేదు. తాజాగా కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి టిడిపిలో చేరిక పైనా త‌న‌కు ఇంత వ‌ర‌కు సీయం స‌మాచారం ఇవ్వ‌లేద‌ని కెఇ స్ప‌ష్టం చేస్తున్నారు. తాను సీయం తో ఈ విష‌యం పై ప్ర‌స్తావ‌న చేయ‌న‌ని..సీయం అడిగితేనే త‌న అభిప్రాయం చెబుతాన‌ని తేల్చి చెప్పారు. దీని ద్వారా తాను ఎంత అసంతృప్తితో ఉన్నారో చెప్ప‌క‌నే చెప్పారు.
తాజాగా టిటిడి అధికారుల తీరు పైనా..
ఇక‌, రాజ‌ధాని లో టిటిడి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున శ్రీవారి ఆల‌యం నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీని కోసం 25 ఎక‌రాల భూమిని కేటాయించ‌టం తో పాటుగా 125 ఓట్ల ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేసింది. ఈ ఆల‌య నిర్మాణంలో భాగంగా తొలి క్ర‌తువు ను ముఖ్య‌మంత్రి నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం కెఇ కృష్ణ‌మూర్తి దేవాదాయ శాఖ‌ను సైతం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే, టిటిడి అధికారులు త‌న‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌క‌పోవ‌టం పై కెఇ కృష్ణ మూర్తి అసంతృప్తికి గుర‌య్యారు. టిటిడి అధికారులు ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాను రాజ‌ధాని ప్రాంతంలోనే అందుబాటులో ఉన్నా ఆహ్వానించ‌క‌పోవ‌టంతో..కెఇ ఆ కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌ర‌య్యారు. ఇలా.. ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్న వైనం పై కెఇ కృష్ణ‌మూర్తి అసంతృప్తితో ఉన్నారు. అయితే, ఇక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ స‌ర్దుకుపోవాల్సి వస్తుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos