హైదరాబాదు : పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండి పడ్డారు.సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, విపక్షాలకు మరో న్యాయమా? టీఆర్ఎస్ ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదు? ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చ బండ తలపెట్టారు. అక్కడికి వెళ్లకుండా రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా రచ్చబండ కోసం ఎర్రవల్లి పోతున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నార’ని దుయ్యబట్టారు. ‘పోలీస్ నిర్బంధాలతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోంది. రైతుల సమ స్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తే అడ్డుకుంటారా? ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. టీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు గుర్తించాలి. వడ్ల కొనుగోళ్లపై ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ లో కేసీఆర్ ధర్నా చేయలేదా?’ని ప్రశ్నించారు.