గోదావరి అవతల వైపున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. గడ్చిరోలి జిల్లా భామ్రాగఢ్‌కు చెందిన వలెవంజ కుజెమి (50) అనే వ్యక్తిని మూడురోజుల క్రితం అపహరించుకుపోయారు. మూడు రోజుల తర్వాత పెనుగుండ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతడిని హత్య చేశారు. మృతదేహం వద్ద ఓ కరపత్రాన్ని మావోయిస్టులు వదిలివెళ్లారు. ఓవైపు మావోయిస్టులు వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకాగా మొదటిరోజే ఘాతుకానికి పాల్పడటంతో మహారాష్ట్ర పోలీసులతోపాటు తెలంగాణ పోలీసులు అలర్టయ్యారు. ఇరు రాష్ట్రాల పోలీసులు గోదావరి తీరం వెంబడి ఉన్న అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.