న్యూ ఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి సాయపడొద్దని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను ఏఐసీసీ పంజాబ్ బాధ్యుడు హరీశ్ రావత్ కోరారు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాలనే నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. ఆయన త్వరలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీశ్ రావత్ డెహ్రాడూన్లో శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. ‘పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందనే వార్తల్లో వాస్తవం లేదు. ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నారనిపిస్తోందన్నారు. పునరాలోచించుకోవాలి. బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయపడకూడదు. కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసినదంతా కెప్టెన్ అమరీందర్ సింగ్ గౌరవ, మర్యాదలను కాపాడటం, 2022లో జరిగే పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలను పెంచడం’ అని చెప్పారు.