బెంగళూరు : గుజరాత్లోని అదాని ముంద్ర రేవు నుంచి గత నెల్లో స్వాధీనం చేసుకున్న రూ.లక్షా తొంబై ఆరు వేల కోట్ల విలువ చేసే 28 వేల కిలోల హెరాయిన్ గురించి ప్రధాన మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాధ్యమాలు నోరు మెదపక పోవటం అనేక అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనాథె శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ భవన్లో విలేఖరులతో మాట్లాడారు. పట్టుబడిన హెరాయిన్లో పాతిక వేల కిలోలు ఇప్పటికే మాదక ద్రవ్యాల విపణలో కరిగిపోయిందని ఆక్రోశించారు. బాలివుడ్లో ఒక గ్రాము మాదక ద్రవ్యం లభించినపుడు రచ్చ రచ్చ చేసిన మాధ్యమాలు అదాని రేవులో పట్టుబడిన భారీ హెరాయిన్ గురించి మౌనం వహించటం ఘోరమని వ్యాఖ్యానించారు. సిబీఐ, ఈడీ, రెవిన్యూ ఇంటెలిజెన్స్ తమ కర్తవ్యాల్ని మరచి విపక్ష నేతలపై దాడులకు పరిమిత మయ్యారాని ఎద్దేవా చేసారు. హెరాయిన్ జాతీయ భద్రతకు సంబంధించిన విషయమైనా మోదీ, అమిత్ షా మౌనాన్ని పాటించటం గర్హనీయమన్నారు. జాతీయ భద్రతను కాపాడటంలో వారిద్దరూ దారుణంగా విఫలమయ్యారనేందుకు ఇది తిరుగులేని నిదర్శనమని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ స్థానం న్యాయ మూర్తిచే విచారణ జరిపించక పోతే దేశ భద్రత ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరించారు.