గువహటి : ప్రభుత్వ ఆక్రమణకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో బాలుడితో బాటు ఇద్దరు యువకులు మరణించారు. సుమారు 800 కుటుంబాలు సోమవారం చేపట్టిన నిరసన ను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించినందుకు స్థానికులు కర్రల దాడికి దిగారు. దీంతో పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షేక్ ఫరీద్( 12) బాలునితో పాటు ఇద్దరు పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. షేక్ ఫరీద్ స్థానిక పోస్టాఫీస్ నుండి ఆధార్ కార్డును తీసుకుని వస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. చాలా మంది గుమిగూడటంతో భయంతో అక్కడే నిల్చున్నాడని అతని పై కూడా కాల్పులు జరిపారని బాలుని తండ్రి రఫీకుల్ ఇస్లాం తెలిపారు. బుల్లెట్ నేరుగా అతని ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడని అన్నారు. ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలంటూ స్థానిక పోస్టాఫీస్ అధికారులు సమాచారం పంపారు. దాన్ని సుకువస్తుండగా చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫరీద్ కుటుంబం ఘర్షణ జరిగిన ప్రాంతానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నివసిస్తోంది. ఈ హింసాకాండలో మరణించిన మరో వ్యక్తి మొయినుల్ హక్. చొక్కా, లుంగీ ధరించిన హక్ కర్రతో దాడి చేసేందుకు యత్నించగా .. పోలీసులు కాల్పులు జరిపిన వీడియో సోషల్మీడియాలో విడుదలైంది. పోలీసులు అతనిని క్రూరంగా కొట్టిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో కనిపించాయి. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ప్రభుత్వ కెమెరామెన్ కింద పడి ఉన్న హక్ని క్రూరంగా కొడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. కెమెరామెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది.