న్యూ ఢిల్లీ : వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. ‘ఆ వ్యాధి ఇంకా పూర్తిగా పోలేదు. ముఖ్యంగా పండుగల వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీకాలు వేసుకున్నవారికీ ఇవి వర్తిస్తాయి. టీకా వేసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుంది. టీకా రోగం తీవ్రతరం కాకుండా చూస్తుంది. కరోనా తిరోగమనంలో సాగుతోంది. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకు రాకూడదు. అందరూ ముసుగుల్ని ధరించాలి. ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకూడద’ని చెప్పారు.