బాబు మాట వినకపోతే!…రాజ్యాంగ ధిక్కరణేనా?

బాబు మాట వినకపోతే!…రాజ్యాంగ ధిక్కరణేనా?

భారత పరిపాలనలో కేంద్రంలో రాష్ట్రపతికి – రాష్ట్రాల్లో గవర్నర్లకు విశేషాధికారాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలతో కలిసిమెలసి వ్యవహరించడంతో పాటు కాస్తంత మెతకగా వ్యవహరించే రాష్ట్రపతులు – గవర్నర్లు ఉన్నంత కాలం ఈ తరహా విశేషాలు అసలు మనకు కనిపించవు. ఎప్పుడైతే ప్రభుత్వాలు చేస్తున్నది తప్పని అటు రాష్ట్రపతులు గానీ – ఇటు గవర్నర్లు గానీ గళం విప్పినప్పుడు మాత్రమే ఈ విశేషాధికారాలకు ఉన్న ప్రాధాన్యం తెలిసి వస్తుంది. ఈ తరహా ఘటన ఇప్పుడు ఏపీలో ఒకటి చోటుచేసుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పంపిన ఓ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగానే మారడంతో పాటుగా గవర్నర్ల వ్యవస్థకు ఏ పాటి అదికారాలు ఉన్నాయన్న విషయం మరోమారు రుజువైంది. అయితే రాష్ట్రపతి – గవర్నర్ల వ్యవస్థలను తప్పుబట్టకుండా… తాము అనుకున్న నిర్ణయాలను అమలు చేసుకునే వెసులుబాటు ఆయా ప్రభుత్వాలకు ఉన్నా… ఆ పని వదిలేసిన టీడీపీ అధినేత – ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… ఏకంగా గవర్నర్ల వ్యవస్థను తులనాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింతగా హీట్ పెంచేశాయని చెప్పక తప్పదు. మొత్తంగా ఇప్పుడు ఏపీలో టీడీపీ సర్కారు వర్సెస్ గవర్నర్ పోటీకి తెర లేపిన చంద్రబాబు తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

అయినా అసలు ఈ వివాదం ఏమిటి? అందులో గవర్నర్ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయంపై చంద్రబాబు అంతగా స్పందించాల్సిన అవసరం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే… ఏపీలో చుక్కల భూముల వివాదాలను పరిష్కరించే నిమిత్తం చంద్రబాబు సర్కారు ఓ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను హడావిడిగా రచించేసిన ప్రభుత్వం దానిని ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తేవాలని తీర్మానించింది. ఆర్డినెన్స్ అమల్లోకి రావాలంటే… గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ చివరి సమావేశాలకు ముందుగా గవర్నర్కు ఈ ప్రతిపాదనను పంపారు. ఆర్డినెన్స్ను పూర్తిగా అధ్యయనం చేసిన నరసింహన్… ఆర్డినెన్స్లోని పొరపాట్లను ఎత్తి చూపుతూ ఆమోదం కుదరదని తేల్చి చెప్పారు. అసలు చివరి అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు.. మరి తాను రచించిన చట్టం అమలులోకి రావపోతే ఎలా? ఇదే రీతిన ఆలోచించిన చంద్రబాబు సహనం కోల్పోయారు. గవర్నర్లకు కూడా ఓ పరిధి ఉంటుందని ఆ పరిధి దాటి వ్యవహరిస్తే ఎలాగంటూ హూంకరించారు. అయినా ఆర్డినెన్స్ ను గవర్నర్ తిరస్కరిస్తే… ఆ ఆర్డినెన్స్ను బిల్లుగా మార్చేసుకుని అసెంబ్లీ ఆమోదం తీసుకుని గవర్నర్కు ప్రతిని పంపించేస్తో సరి. ఆ బిల్లు అమల్లోకి వచ్చేసినట్టే కదా.మరి అంతటి మంచి అవకాశాన్ని వదిలేసిన చంద్రబాబు… తాను పంపిన ఆర్డినెన్స్ను గవర్నర్ తిరస్కరించడమేమిటని తెగ బాధపడిపోయారు. ఆ బాధలో నుంచే వచ్చిన ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయారు. మొత్తం గవర్నర్ల వ్యవస్థనే తూలనాడేశారు. అంతేనా… గవర్నర్ కుర్చీలోని నరసింహన్ ఏపీ పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కూడాఓ నింద కూడా వేసేశారు. అంతేనా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నరసింహన్… ఏపీ పట్ల మాత్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే వేసిన నిందకు ఇప్పుడు కారణం చూపే యత్నం చేశారు. మొత్తంగా పాలనలో తనకున్నంత అనుభవం దేశంలో ఏ ఒక్కరికీ లేదంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు… చిన్న విషయానికి కూడా నానా హైరానా పడిపోయి… గవర్నర్ల వ్యవస్థపై ఓ నిందేసి తన పాలనానుభవం ఏ పాటితో ఇట్టే నిరూపించేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos