కృష్ణమ్మ తీరాన కలియుగ వైకుంఠం

కృష్ణమ్మ తీరాన కలియుగ వైకుంఠం

రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గురువారం తొలి అడుగు పడనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. భూకర్షణ, బీజావాపనాన్ని నిర్వహించి ఫిబ్రవరి 10న భూమిపూజ చేయనుంది. కృష్ణానది తీరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయం… చోళులు, చాళుక్యుల కాలం నాటి వాస్తు, నిర్మాణ శైలికి అద్దం పడుతుంది.

ఎలా ఉంటుందంటే..

* తిరుమల ఆలయ శోభ ప్రస్ఫుటించేలా మొత్తం రాతితోనే నిర్మించాలని తితిదే భావిస్తోంది. ఆలయ గోడలు, లోపలి భాగమంతా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఉంటుంది. రెండు ప్రాకారాలుంటాయి. కశ్యప శిలాశాస్త్రంలోని విమానార్చన కల్పంలో పొందుపరిచినట్లు ఆగమబద్ధంగా నిర్మిస్తారు.
* రూ.150 కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే తితిదే పాలకమండలి ఆమోదించింది. నాలుగు దశల్లో వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. దీనికి ఇప్పటికే టెండర్లు ఆమోదం పొందాయి. శంకుస్థాపన పూర్తయిన వెంటనే పనులు చేపట్టనున్నారు.
* హిందూ ఆలయ నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచే కాంచీపురం, వైకుంఠ పెరుమాళ్‌ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, బాదామీ విష్ణు చాళుక్యుల ఆలయం, హంపీలోని విరూపాక్ష, విజయ విఠల ఆలయాల నిర్మాణ శైలిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ శిల్ప కళాకారులు, వాస్తుశిల్ప శాస్త్ర నిపుణులు, ఆచార్యుల సూచనలను స్వీకరిస్తున్నారు.
* ఆలయాన్ని నిర్మించాక తితిదే తన నిర్వహణలోకి తీసుకుంటుంది. పరిపాలన వ్యవహారాలకు ఓ పాలకమండలిని నియమిస్తుంది. గుంటూరు, విజయవాడల నుంచి ప్రత్యేకంగా వెంకటపాలెం శ్రీవారి ఆలయానికి బస్సులను నడపనున్నారు.
లోపలి ప్రాకారం ఇలాగర్భాలయాన్ని 18’-6 × 18’-6 చుట్టుకొలతల ప్రకారం నిర్మిస్తారు. అంతరాలయం, అర్ధమండపం, మహామండపాన్ని 27’-9 × 27’-9 కొలతల ప్రకారం, ముఖమండపాన్ని  37’-0 × 37’0తోనూ నిర్మిస్తారు. మొత్తం ప్రాకారం పరిమాణం 250-0’ × 130’ × 0’తో ఉంటుంది. లోపలి ప్రాకారంలో గరుడాలయం, శ్రీవారిపోటు, యాగశాలతో పాటు 70 అడుగుల ఎత్తులో ఐదడుగుల తూర్పు ప్రవేశద్వారం(గోపురం) కడతారు.
వెలుపలి ప్రాకారం ఇలాఆలయం వెలుపలి ప్రాకారంలో ధ్వజస్తంభం, మండపం, బలిపీఠం, ఆర్జితసేవ మండపం, ఉత్సవ మండపం, పరకామణి మండపం, అద్దాల మండపం, వెలుపలి ప్రాకారం మూడువైపులా ఐదంతస్తుల రాజగోపురాలు వస్తాయి. దీంతోపాటు తూర్పు ప్రవేశద్వారం వద్ద పడికావలి మండపంతోపాటు ఏడంతస్తుల అతిపెద్ద రాజగోపురం నిర్మిస్తారు. వెలుపలి ప్రాకారం చుట్టూ నాలుగు మాడవీధులు, శ్రీవారి పుష్కరిణి, వాహన మండపం, రథ మండపం, శ్రీఆంజనేయస్వామివారి ఆలయం ఉంటాయి. మొత్తం స్థలం చుట్టూ ప్రహరీ రానుంది.
శాస్త్రోక్తంగా నిర్మాణంఆలయ నిర్మాణాన్ని ఆగమబద్ధంగా నిర్మిస్తాం. కొత్త రాజధానిలో కలియుగ వైకుంఠనాథుడి ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడం శుభ పరిణామం. ఇప్పటికే తితిదేకు 25 ఎకరాల భూమిని ప్రభుత్వం అందించింది. నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు లభించాయి. వచ్చేనెల 10న భూమిపూజ నిర్వహిస్తాం.- పోలా భాస్కర్‌, తితిదే జేఈవో

తాజా సమాచారం

Latest Posts

Featured Videos