కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో అమ్మాయిలకు పురుషులు బోధించరాదని తాలిబన్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉన్నత విద్యా మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు. ‘దేశంలో విద్యా విధానం కూడా షరియా చట్టాలకు అనుగుణంగానే ఉంటుంది. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాం.యూనివర్సిటీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే క్లాసులో కూర్చోవడాన్ని అనుమతించబోము. ఇస్లామిక్ సూత్రాలను అమలు చేయడంలో దేశ విద్యా విధానం ఘోరంగా విఫలమైంది. స్లాంకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క దానిని తొలగిస్తామ’ని తేల్చి చెప్పారు.‘అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా తరగతులు నిర్వహించేందుకు తగిన మానవ వనరులు లేక పోవడం. ఖర్చు తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉండడంతో యూనివర్సిటీలు ఈ విషయంలో ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అమ్మాయిలకు ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంద’ని జర్నలిస్ట్ బషీర్ అహ్మద్ గ్వాఖ్ ట్వీట్ చేశారు.